హదీథ్ అంటే ఏమిటి?
హదీథ్ అంటే చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క ఆదేశాలు, ఆచరణలు, వారు అనుమతించిన లేదా నిరోధించిన పద్ధతులు మరియు వారి వ్యక్తిగత ప్రవర్తన కు సంబంధించిన విషయాలు.
1. నిర్వచనం యొక్క వివరణ
A) ఆదేశాలు – అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మాటల ద్వారా ప్రజలను ఆజ్ఞాపించినవి.
B) ఆచరణలు – అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా అచరించి, ప్రజలకు చూపినవి.
C) అనుమతించిన లేదా నిరోధించిన పనులు – అంతిమ ప్రవక్త ముహమ్మద్ )సల్లల్లాహుఅలైహి వసల్లం( ఆమోదించిన వారి సహచరుల ఆచరణలు.
D) ప్రవర్తన – అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భౌతికలక్షణాలు, గుణగణాలు మరియు వ్యక్తిగత స్వభావపు విషయాలు.
2. ఇస్లాం ధర్మసూత్రాలకు 2వ మూలం హదీథ్/సున్నహ్ లు.
ఇస్లాం ధర్మసూత్రాలకు మొదటి మూలం – దివ్యఖుర్ఆన్. మరియు రెండవ మూలం – హదీథ్ & సున్నహ్ లు. అంతే కాకుండా హదీథ్ శాస్త్రం దివ్యఖుర్ఆన్ కు క్రియాత్మక వ్యాఖ్యానం లాంటిది. అల్లాహ్ ఆదేశాలు దివ్యఖుర్ఆన్ లో కొన్ని చోట్ల సాధారణ ఆజ్ఞలుగా కనబడవచ్చు. ఉదాహరణకు ఖుర్ఆన్ లోని “మరియు క్రమబద్ధంగా నమాజును స్థాపించండి” అనే అల్లాహ్ యొక్క ఆజ్ఞను గమనించండి. ఇక్కడ నమాజును క్రమబద్ధంగా ఎలా పాటించాలి? అనే విషయము ఖుర్ఆన్ లో కనబడదు. అయితే చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) జీవనవిధానం ద్వారా అంటే హదీథ్/సున్నహ్ ల ద్వారా ఈ ఆజ్ఞను పాటించే విధానాన్ని అల్లాహ్ మనకు తెలియజేసెను. ప్రతి ముస్లిం నియమిత సమయాలలో ప్రతి దినం ఐదు సార్లు క్రమపద్ధతిలో నమాజు చేయాలనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి, దివ్యఖుర్ఆన్ లోని నమాజును స్థాపించండి అనే అల్లాహ్ ఆజ్ఞను పూర్తి చేసే విధానాన్ని చూపెట్టినారు. అంటే ఖుర్ఆన్ లోని ఆదేశాల స్పష్టమైన వివరణ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం నుండి లభిస్తుంది.
3. హదీథ్ విజ్ఞానశాస్త్రం (హదీథ్ ముస్తలహ్)
అస్సనద్(ఉల్లేఖకుల పరంపర) మరియు అల్ మతన్(అసలు విషయం) ను గుర్తించడానికి అవసరమైన నియమ నిబంధనలున్న శాస్త్రాన్నే హదీథ్ ముస్తలహ్ అంటే హదీథ్ విజ్ఞానశాస్త్రం అంటారు.
అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర): హదీథ్ ను రికార్డు చేసిన గ్రంథకర్త (బుఖారీ, ముస్లిం, తిర్మీదీ, అబుదావుద్..) నుండి క్రమ పద్ధతిలో ఒక్కొక్కరిగా చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లమ్) వరకు హదీథ్ ను ఉల్లేఖించిన వారందరి పేర్లు(పూర్తి వివరాలతో)
అల్ మతన్: హదీథ్ లోని అసలు విషయం.
ఉదాహరణ: సహీముస్లిం హదీథ్ గ్రంథంలోని ఒక హదీథ్ లో ఇలా నమోదు చేయబడినది – ముహమ్మద్ బిన్ ఉబైద్ మాకు తెలిపారు, అబు అవానాహ్ మాకు తెలిపారు , అబి హుసైన్ ద్వారా, అబి సాలెహ్ ద్వారా, అబిహురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు – ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా ప్రకటించారు “ఎవరైతే కావాలని (అహంభావంతో) నాకు అవిధేయుడిగా ఉంటాడో, అతడి స్థానం నరకాగ్నియే”
పై హదీథ్ లోని అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) –
నమోదు చేయబడిన హదీథ్ గ్రంథం (ఇక్కడ సహీముస్లిం గ్రంథం)
ఉ ముహమ్మద్ బిన్ ఉబైద్
ల్లే అబు అవానాహ్
ఖ అబిహుసైన్
కు అబి సాలెహ్
ల అబి హురైరా(రదియల్లాహుఅన్హు)
పరంపర
చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్)
పై హదీథ్ లోని అల్ మతన్ (హదీథ్ లోని అసలు విషయం) – ఎవరైతే కావాలని నాకు అవిధేయుడిగా ఉంటాడో, అతడి స్థానం నరకాగ్నియే.
4. హదీథ్ విజ్ఞానశాస్త్ర ముఖ్యలక్ష్యం
చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) హదీథ్ లను అసలైన రూపంలో ఎటువంటి కల్పితాలకు, (మార్పులు/చేర్పులకు) తావివ్వకుండా భద్రపరచడం.
5. హదీథ్ విజ్ఞానశాస్త్రం కేవలం ముస్లింల ప్రత్యేకత
హదీథ్ ఉల్లేఖనల ప్రామాణికత ఒకరి తర్వాత మరొకరుగా, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వరకు చేరటం, అంతే కాకుండా ఉల్లేఖించిన వారి గుణశీలాల గురించిన నమ్మకమైన సమాచారం కూడా భద్రపరచటమనేది ఇస్లాంలో తప్ప మరే జాతిలోనూ, ఏ కాలంలోనూ, ఏ ఇతర మతాల మూల ప్రతులలో మరియు గ్రంథాలలో కనబడని ఒక ప్రత్యేకమైన విజ్ఞానశాస్త్రం. ఇంకా అస్సనద్ అంటే ఉల్లేఖకుల పరంపర గురించి ప్రశ్నించటం గాని, వారి గుణశీలాల గురించి పరిశీలించటం మరియు పరిశోధించడం గాని చేయకుండానే ఇతర చారిత్రక గ్రంథాలు మరియు ధర్మగ్రంథాలు కేవలం ఉల్లేఖకుల మాటలనే భద్రపరచాయి, నమోదు చేశాయి.
No comments:
Post a Comment