Search This Blog

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం


1. అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం – الشرك

నిర్వచనం:
అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది,  పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.
1-   పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –
(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగాఅష్షిర్క్ (బహుదైవారాధనఅనేదిఅత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.
2-    క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
(النساء 48) – “إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ”
భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక  ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}
3-    స్వర్గం నిషేధించబడినది:  ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –
”إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ “ (المائدة 72)
భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.
4-   పుణ్యకార్యాలన్నీ వ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
” ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)
భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.
ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
(الزمر70) –  “وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ”
భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}
5-  ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.
(التوبة 5)-  “فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ”
భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు
“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –
అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప,  నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.
6-      ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు –  “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును,  ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం 
కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.
7-   ఒక లోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన)  అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.

షిర్క్ (బహుదైవారాధన) లోని భాగాలు:

షిర్క్ (బహుదైవారాధన) రెండు విభాగాలుగా విభజింపబడినది.

మొదటి విభాగం: అష్షిర్క్ అల్ అక్బర్ (ఘోరమైన భాగస్వామ్యం) – ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేస్తుంది మరియు ఒకవేళ పశ్చాత్తాప పడి, క్షమాభిక్ష అర్థించకుండానే చనిపోయినట్లయితే, వారిని నరకాగ్నిలో శాశ్వతంగా శిక్షింపబడుతూ ఉండేటట్లు చేస్తుంది. దైవశక్తులనే మూఢనమ్మకంతో ఇతరులను దర్శించి, వాటికి బలి సమర్పించుకుని తద్వారా తమ కోరికలు పూర్తిచేయమని, కష్టాలు తీర్చమని వేడుకోవటం, సమాధులకు, జిన్నాతులకు, దుష్టశక్తులకు మొక్కు బడులు చెల్లించడం వంటి తెలిసిన ఏ ఆరాధననైనా సర్వలోక సృష్టికర్త, సర్వశక్తిసమర్ధుడు అయిన అల్లాహ్ కు కాకుండా వేరే ఇతర వాటికి సమర్పించటం లేదా అల్లాహ్ తో పాటు వేరే ఇతర వాటికి కూడా సమర్పించటం. ఇంకా తమకు హాని చేయవద్దని చనిపోయిన వారిని, జిన్నాతులను, దుష్టశక్తులను, దయ్యాలను వేడుకోవటం మరియు కేవలం అల్లాహ్ మాత్రమే ప్రసాదించగలిగే శుభాలను అవి కూడా కలిగించ గలవని ఆశించి వాటిపై నమ్మకం పెట్టుకోవటం. దౌర్భాగ్యం కారణంగా ఈ రోజుల్లో దివ్యపురుషుల మరియు పుణ్యపురుషుల సమాధులపై గోపురాలు కట్టడం పెరిగి పోతున్నది. ఖుర్ఆన్ లో యూనుస్ అధ్యాయంలోని 18వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –

سورة يونس : 18 “وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لا يَضُرُّهُمْ وَلا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللَّهِ”
భావం యొక్క అనువాదం – {అల్లాహ్ తో పాటు వారు ఎటువంటి హాని కలిగించలేని మరియు ఎటువంటి శుభాలు కలిగించలేని ఇతరులను ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా పలుకుతున్నారు: “ఇవి మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాయి}

రెండవ విభాగం: అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన), ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేయదు, కాని నిశ్చయంగా ఏకైక దైవారాధనకు తప్పక నశింప జేస్తుంది  మరియు ఇది తప్పక ఘోరమైన భాగస్వామ్యానికి (అష్షిర్క్ అల్ అక్బర్) చేర వేస్తుంది. ఇది రెండు రకాలుగా విభజింపబడినది:

మొదటి రకం: شرك ظاهر బయటికి కనబడే షిర్క్, మరియు ఇది మాటల ద్వారా మరియు చేతల ద్వారా జరుగుతుంది.
మాటలలో బయటికి కనబడే షిర్క్ అంటే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయటం ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు “من حلف بغير الله”- అనువాదం – “ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరుల పై ప్రమాణం చేస్తారో, వారు అవిశ్వాసపు పని (లేదా అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యాన్ని చేర్చిన పని) చేసిన దోషిగా శిక్షకు అర్హులవుతారు.” మరొకసారి ఒక సహచరుడు – అల్లాహ్ మరియు మీరు ఏది తలిస్తే (అది జరుగుతుంది) అని వారితో పలికినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఇలా స్పందించారు, “أجعلتني لله نداّ” – అనువాదం – “నన్ను అల్లాహ్ కు సాటిగా చేస్తున్నారా? (అలా పలకే బదులు) కాని ‘కేవలం అల్లాహ్ ఏదైతే తలుస్తాడో (అది జరుగుతుంది)’ అని పలక వలెను.” అలాగే ‘అల్లాహ్ కోసం మరియు ఫలానా ఫలానా వారికోసం’ అని పలికే బదులు, ఎవరైనా ఇలా పలకవలెను ‘‘ఏదైతే అల్లాహ్ తలుస్తాడో, ఆ తర్వాత ఫలానా ఫలానా వారు తలుస్తారో’ అని పలక వలెను. ఎందుకంటే ‘అల్లాహ్ తర్వాత ఫలానా ఫలానా’ అని పలకటంలో ‘తర్వాత’ అనే వదం పరంపర క్రమాన్ని తగ్గిస్తున్నది. కాబట్టి, దాసుడి ఇష్టాని కంటే ముందు అల్లాహ్ యొక్క ఇష్టం వస్తున్నది. దివ్యఖుర్ఆన్ లోని అత్తక్వీర్ అధ్యాయంలోని 29వ వచనంలో అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు  “وَمَا تَشَاءُونَ إِلا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ” (التكوير 29) – భావం యొక్క అనువాదం – {కాని మీరు ఇష్టపడలేరు, కాని సర్వలోకాల పరిపాలకుడైన ఒక్క అల్లాహ్ తప్ప}. ఇక ‘మరియు’ అనే పదం, తెలిపిన వైఖరి ప్రకారం ఇది జతపర్చటాన్ని మరియు పంచుకోవటాన్ని సూచిస్తుంది. ఉదాహరణగా “ నాకు సహాయపడే వారిలో అల్లాహ్ మరియు మీరు” అనేది మరియు “ఇది అల్లాహ్ యొక్క మరియు మీ యొక్క దీవెనల వలన” .
చేతలలో బయటికి కనబడే షిర్క్ – అంటే ఆపదలను, కష్టాలను తొలగిస్తుందని మరియు వాటి నుండి రక్షిస్తుందని, రింగు తొడగటం లేదా త్రాడు లేక దారం కట్టుకోవటం. ఏదేమైనప్పటికీ, ఈర్ష్యాసూయాల నుండి, దిష్టి తగలటం నుండి కాపాడుకోవటం కోసం రక్షాబంధనలు, తాయెత్తులు, తావీజుల వంటివి కట్టుకోవలెనని అల్లాహ్ యొక్క ఇస్లామీయ ధర్మ శాస్త్రం (షరియత్) లో ఎక్కడా ప్రకటింప బడలేదు. కాబట్టి ఎవరైనా ఇటువంటి మంత్రతంత్రములను సహాయపడతాయని విశ్వసిస్తూ, వాటిని ఉపయోగిస్తున్నట్లయితే షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన భాగస్వామ్యం) చేస్తున్న వారవుతారు. కాని ఒకవేళ ఎవరైనా ఆ తాయెత్తుల వంటివి స్వయంగా తమకు లాభం చేకూర్చుతాయని నమ్మితే, వారు షిర్క్ అల్ అక్బర్ (ఘోరమైన మహాపాపం) చేస్తున్న వారవుతారు. ఎందుకంటే వారు అల్లాహ్ పై కాకుండా ఇతర వాటిపై ఆధారపడుతున్నారు.
రెండవ రకం: شرك خفي బయటికి కనబడని, రహస్యమైన షిర్క్ మరియు ఇది తలంపుల, సంకల్పం, కోరికల, ఇష్టాయిష్టాల ద్వారా ఇతరులకు చూపాలనే ఉద్ధేశంతో జరుగుతుంది. ఎవరికైనా చూపించాలనే సంకల్పంతో, వారు తనను పొగడాలనే కోరికతో ప్రార్థనలు చేయటం. ఉదాహరణకు ప్రజలు తనను పొగడాలనే ఉద్ధేశంతో ప్రార్థనలు చేస్తూ, ఇతరులకు దానధర్మాలు చేయటం, ఇంకా తన కంఠస్వరాన్ని ప్రజలు పొగడాలని మంచి ఖిరాత్ తో ఖుర్ఆన్ పారాయణం చేయటం. ఈ సంకల్పం తప్పక వారి ఆరాధనలను నిర్వీర్యం చేస్తుంది. దివ్యఖుర్ఆన్ లోని అల్ కహాఫ్ అనే అధ్యాయంలోని 110వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు.
(الكهف 110) – “فَمَنْ كَانَ يَرْجُوا لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلا صَالِحًا وَلا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا”
భావం యొక్క అనువాదం – {తన ప్రభువు ను కలవబోతున్నామని ఎవరైతే భావిస్తున్నారో, వారు పుణ్యకార్యాలు చేయవలెను మరియు అల్లాహ్ కు భాగస్వామిగా ఎవరినీ అంగీకరించకూడదు}.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు,
“ أخوف ما أخاف عليكم الشرك الأصغر ”
“నేను మీ గురించి ఎక్కువగా భయపడేది ఏమిటంటే అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన)” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు. ‘అష్షిర్క్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) అంటే ఏమిటి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా r?’, వారిలా జవాబిచ్చారు -“అర్రియా الرياء (show off పనులు)”. ఉదాహరణకు ప్రపంచంలో కొన్ని లాభాలు పొందటానకి ప్రార్థనలు చేయటం. అలాంటి సంకల్పంలో కొందరు వ్యక్తులు హజ్ యాత్ర చేస్తారు, అజాన్ (నమాజు కోసం పిలిచే పిలుపు) ఇస్తారు, నమాజులో ప్రజలకు నాయకత్వం వహించి, బదులుగా పైసలు తీసుకుంటారు, ఇస్లామీయ ధర్మ విద్యను అభ్యసిస్తారు, ఇంకా ధనం కోసం ధర్మయుద్ధం (జిహాద్) లో పాల్గొంటారు. వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు “تعس عبد الدينار” – అనువాదం – “దీనార్ దాసుడు, దిర్హమ్ దాసుడు, ఖమీలా (మందమైన మెత్తని ఉన్నతమైన వస్త్రం) దాసుడు మరియు ఖమీసా (మంచి దుస్తుల) దాసుడు నశించిపోవుగాక, ఎందుకంటే వాటితో అతడు సంతృప్తి పడినాడు అవి దొరకకపోతే అతడు సంతోషం చెందడు (అసంతృప్తి చెందతాడు)”
ఇబ్నె ఖయ్యుం అనే ప్రముఖ ఇస్లామీయ పండితుడు ఇలా తెలిపెను, ‘సంకల్పంలో మరియు భావాలలో బహుదైవారాధన అంటే ‘అది తీరాలు లేని ఒక సముద్రం లాంటిది, చాలా తక్కువ మంది అందులో నుండి బతికి బయట పడినారు’. కాబట్టి, ఎవరైనా సరే, ఏదైనా పనిని అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులను సంతృప్తి పరచటానికి చేసినా మరియు అల్లాహ్ వైపుకు  కాకుండా వేరే ఇతరుల దరి చేరి, వేడుకున్నా, వారు తమ సంక్పంలో మరియు ఆలోచనలలో షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యం కల్పించటం) చేసిన వారవుతారు.   దానికి విరుద్ధంగా, దైవ విశ్వాసం అంటే తమ మాటలలో, చేతలలో మరియు సంకల్పంలో, భావాలలో అల్లాహ్ కు విశ్వసనీయుడిగా జీవించటం అన్నమాట. ఇదియే తన దాసుల నందరినీ ఆచరించమని అల్లాహ్ ఆదేశించిన ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క హనీఫా ధర్మం (బహుదైవారాధన నుండి ఏక దైవరాధన వైపునకు మరలటం). ఈ ధర్మం కాకుండా వేరే ఇతర ఏ ధర్మాన్నీ అల్లాహ్ తీర్పుదినం నాడు స్వీకరించడు. హనీఫా ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తిరిగి బోధించటమే ఇస్లాం ధర్మంలోని సుగుణం.   దివ్యఖుర్ఆన్ లోని ఆలె ఇమ్రాన్ అధ్యాయంలోని 85వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
سورة آل عمران : 85 “وَمَنْ يَبْتَغِ غَيْرَ الإسْلامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنْ الْخَاسِرِينَ” –
దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {ఎవరైనా ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ఇతర ధర్మాన్ని అనుసరించాలని కోరుకుంటే, అది ఎన్నటికీ స్వీకరించబడదు. మరియు పరలోకంలో వారు నష్టపోయిన వారి (పుణ్యాలన్నీ కోల్పోయిన వారి) శ్రేణులలో ఉంటారు}. వాస్తవానికి ఇదే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సురక్షిత విశ్వాసం, దీనిని తిరస్కరించిన వారందరూ అజ్ఞానంలో అట్టడుగు స్థాయికి చేరుకున్నవారే.”
అష్షిర్క్ అల్ అక్బర్ (అత్యంత ఘోరాతి ఘోరమైన బహుదైవారాధన) మరియు అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) ల మధ్య ఉన్న కొన్ని ప్రధాన విభేదాలను ఇక్కడ పున:పరిశీద్దాం:
1-   అష్షిర్క్ అల్ అక్బర్ ప్రజలను ఇస్లాం నుండి బహిష్కరింప జేస్తుంది. కాని అష్షిర్క్ అల్ అస్గర్ ప్రజలను ఇస్లాం నుండి బహిష్కరింప జేయదు.
2-     అష్షిర్క్ అల్ అక్బర్ ప్రజలను నరకాగ్నిలో శాశ్వత నివాసం ఏర్పరుస్తుంది. కాని అష్షిర్క్ అల్ అస్గర్ ప్రజలను నరకాగ్ని లో శాస్వత నివాసం ఏర్పరచదు. కొంతకాలం శిక్షను అనుభవించిన తర్వాత అలాంటి వారిని నరకాగ్నిలో నుండి బయటకు తీయటం జరుగును.
3-     అష్షిర్క్ అల్ అక్బర్ వలన చేసిన పుణ్యకార్యాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ప్రపంచ జీవితంలో చేసిన మంచి పనులు, పుణ్యకార్యాలు పరలోకంలో నిష్ప్రయోజనమైపోతాయి.  అష్షిర్క్ అల్ అస్గర్ వలన అలా జరుగదు. అయితే లభించే పుణ్యాలు తగ్గుతాయి.

అష్షిర్క్ అల్ అక్బర్ వలన ప్రాణం మరియు సంపద సంరక్షణలో ఉండవు. కాని అష్షిర్క్ అల్ అస్గర్ వలన సంఱక్షణలో ఉంటాయి.

No comments:

Post a Comment